అనుసూరి వేంకటేశ్వర రావు
sk 101_01 అనుసూరి వేంకటేశ్వరరావు ,హైదరాబాద్
మ్యాగజైన్ కోసం
కవి
హద్దులు లేని రాజ్యం భావప్రపంచం
ఆరాజ్యానికి రారాజు కవి
కవి కాంచనిది లేదీ జగమ్మున
రవి కాంచనిదియు కవి గాంచును
నయనమ్ము లకందనివి కవనమ్ముల ముందుంచగలడు
కవితలల్లుట ఒక తపస్సు
చివరి పంక్తికి మొాక్షం
కవి మితవాది
ముత్యాల సరాల పదమాలికలో
ఆకాశమంత విషయాన్ని చెప్పగలడు
అక్షర అల్లికతో
సముద్రపులోతు అర్దాన్నీచెప్పగలడు
కవి అతివాది
మాటల తుాటాలతో సుడిగాలి సృష్టించ గలడు
అక్షర ఫిరంగులతో సునామీలు సృష్టించగలడు
కవి హేతు వాది
నిజాల లోతులు శోధించి
నిస్వార్థ చింతనుడై
నిజం ఇజంను
పదాల పదఘట్టన తో
సమ సమాజం కోసం
సుమ జల్లులలో విరిసే
ఆనందపు హరివిల్లుల కోసం
సమాజం ముందుంచ గలడు
కవి హితవాది
సమాజంలో కుళ్లును తొలగించటానికి
అక్షరాలనే స్వఛ్చ భారత్ లా సంధించి
ఉఛ్చమైన నవభారత్ సాధించగలడు
కలాము చెప్పిన సలాము మాట"కల"
కలలు లేని కలకనలేని యువతను
జూలు విదిల్చి లక్ష్యం కోసం కార్యోన్ముఖులనుచేయగలడు
కవి మానవతావాది
ఆడపిల్లనుచు బూృణహత్యలు
పాల్పడు రక్కసులను దునుమాడ
కవిచేత కవిత నాగాస్త్రమవును
కాలేజి మహిళ లకు ప్రేమాంధుల కామాంధు ల
నుండి ప్రాపుగ నిలువ
కవిచేత కవిత నారాయణాస్త్రమగును
అక్కరకు రాని వాగ్దానాలను
పుంఖాను పుంఖాలు గుప్పించి
లేని ఆశలు కల్పించి లెక్క తప్పి
నోటు రాజకీయాలు తో గద్దెనెక్కి
ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే
కవిచేత కవిత బ్రహ్మాస్త్రమగును
అందుకే
కవి చేత కలం ఓ అంకుశం
కవి ఆశావాది
అక్షర ఆర్తి సమయస్పూర్తి
సందేశమవ్వాలి
యువతను మేల్కొలపాలి
భవితకు మార్గదర్శనమవ్వాలి
ఆ సందేశమే దేశానికి
ప్రగతి దిశానిర్దేశ్యం
కవి కలం నుంచి
జాలువారే ప్రతి అక్షరం
కోటి గొంతుకలకు
మాటవ్వాలి....పాటవ్వాలి
జగతికి ప్రగతి బాటవ్వాలి
మేలుకొలుపు ....సుప్రభాతమవ్వాలి
ఆశ...
సమ సమాజం కోసం
నేను సైతం...
సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
ప్రమిదనొక్కటి వెలిగించాను...
***************** ************
1/11/2015 తెలుగువేదిక.నెట్ 7వ సంచికలో ప్రచురితమైన కవిత
sk101_02 అనుసూరి వేంకటేశ్వర రావు
హైదరాబాద్
నేటి రైతు దయనీయ స్తితికి అద్దం పట్టి
బతుకమ్మ పాటలో మీ ముందుంచుతున్నా
ఆత్మాహుతి రైతులకు నివాళులతో అంకితం
* పల్లెబతుకమ్మ *
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల
బంగారు బతుకమ్మ ఉయ్యాల
బతుకు భారమై ఉయ్యాల
బతుకులీడుస్తున్నముయ్యాల
చెట్టు పుట్ట లేక ఉయ్యాల
చెదపురుగు బతుకాయె ఉయ్యాల
ఎండలే యేడెక్కి ఉయ్యాల
వర్షాలు కురవక ఉయ్యాల
చెరువులెండిపాయె ఉయ్యాల .....బతుకమ్మ
దుక్కిదున్నలేదు ఉయ్యాల
మునుపుచేసినప్పు ఉయ్యాల
మూడురెట్లాయెను ఉయ్యాల
ముప్పూటబోజనం ఉయ్యాల
కలలోనె తింటుంటముయ్యాల .....బతుకమ్మ
ఇన్నిబాధలున్న ఉయ్యాల
బతుకమ్మపూజకు ఉయ్యాల
గునుగు పూలుతెచ్చి ఉయ్యాల
ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాల
వరుసపేర్చి నీకు ఉయ్యాల
బతుకమ్మ చేస్తమే ఉయ్యాల ..... బతుకమ్మ
తంగేడు పూలు తెచ్చి ఉయ్యాల
తరచిపేరుస్తమే ఉయ్యాల ...........బతుకమ్మ
బంతిపూలు తెచ్చి ఉయ్యాల
బొద్దుగాపేరుస్తముయ్యాల ...........బతుకమ్మ
చామంతిపూలు తెచ్చి ఉయ్యాల
చక్కగా పేరుస్తముయ్యాల ........బతుకమ్మ
తామర పువ్వు తెచ్చి ఉయ్యాాల
తీరుగా పేరుస్తముయ్యాల ........బతుకమ్మ
గుమ్మడిపువ్వుతెచ్చి ఉయ్యాల
ముద్దుగుమ్మలాపేరుస్తముయ్యాల ...బతుకమ్మ
దోసపువ్వు తెచ్చి ఉయ్యాల
దోసిట్లపేరుస్తముయ్యాల..........బతుకమ్మ
కట్లపువ్వుతెచ్చి ఉయ్యాల
కట్లుగాపేరుస్తముయ్యాల ........బతుకమ్మ
బీరపువ్వు తెచ్చి ఉయ్యాల
నారతోపేరుస్త ము య్యాల .....బతుకమ్మ
గడ్డిపువ్వు తెచ్చి ఉయ్యాల
గుంపుగాపెరుస్తముయ్యాల........బతుకమ్మ
వాముపువ్వుతెచ్చి ఉయ్యాల
వాటంగపేరుస్తముయ్యాల........బతుకమ్మ
ఒక్కొక్క పువ్వేసి ఉయ్యాల
వరుసపేరుస్తాము ఉయ్యాల
పసుపుగౌరమ్మను ఉయ్యాల
పొందిగ్గచేస్తాము ఉయ్యాల .....బతుకమ్మ
కష్టాలు తొలగించు ఉయ్యాల
వర్షాలు కురిపించు ఉయ్యాల
పంటలేపండించు ఉయ్యాల
గాదెలన్నినిండి ఉయ్యాల
కాసులేకురవాలి ఉయ్యాల
అప్పులేతీరాలి ఉయ్యాల
రైతులందరు కూడ ఉయ్యాల
చల్లంగ ఉండాలి ఉయ్యాల
**********************
sk101_03 అనుసూరి వేంకటేశ్వరరావు
బంగారు బతుకమ్మ
తెలంగాణ పల్లె రంగులద్దుకున్నది
తెలంగాణ పట్నంలో పూలజాతర
ప్రపంచంలో అరుదైన వేదిక
మనదైన సాంస్కృతిక వేడుక
బడీడు ఆడపిల్ల బడిబాటమరిచింది
చెల్కల్ల గుట్టల్ల తిరిగింది
కాలు ముల్లు గుచ్చినా
రాళ్ళు తగిలినా
అన్వేషణ ఆపలేదు
ఈపువ్వు ఆపువ్వు అని లేదు
అన్ని పువ్వులు ఏరుకుంది
ఇల్లుచేరి ఈవాడ ఆ వాడ
అందరిని పిలిచింది
తంగేడు,పట్టుకుచ్చులు
గునుగుపూలు,గుమ్మడిపూలు
బీరపూలు,కట్లపూలు,
దోసపూలు,గడ్డిపూలు
గుమ్మడిపూలు,వాముపూలు
బంతిపూలు, చామంతిపూలు
అన్నిపూలు అందరు కలిసి
అందంగా పేర్చారు బతుకమ్మలను
సాయంకాలం......
అన్ని బతుకమ్మలు చెరువు దగ్గర చేరాయి
గుడిగోపురం లా రంగురంగుల బతుకమ్మలు
స్తీత్వాన్ని పూజించే పండుగ
సప్తవర్ణాల పండుగ
రంగురంగుల పట్టు వస్తాలలో
మహిళ ల జాతర
చప్పట్లు కోలల లయతప్పని బాణి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల బంగారు బతుకమ్మ ఉయ్యాల
ఒక్కేసి పువ్వేసి చంద మామ..
పాటలతో మొదలై
పోయిరావమ్మా గౌరమ్మా...పొద్దుపోయే గౌరమ్మా
మల్లెప్పుడత్తవే గౌరమ్మా
అని గౌరమ్మను సాగనంపారు.
**********************
sk101_04 అనుసూరి వేంకటేశ్వర రావు
వానపాము
వర్షఋతువు వచ్చింది
తొలకరిఝల్లు తెచ్చింది
నేలతల్లి పులకించింది
తడిసిన మట్టి పరిమళం
ఆస్వాదిస్తున్నారు జనం
కానీ......
ఒక చిన్నప్రాణిలో
ఆనందం..ఆందోళన...కలకలం
"తడిసిన మట్టి మృత్తికా పరిమళం
నాసిక తాకగానే
ఎక్కడో లోతట్టు మట్టి పొరలో
సకుటుంబంగా దాగున్న నాకు
ప్రాణం లేచి వచ్చింది
ఆహా! ఏమి పరిమళం !
ఏమి అనుభూతి....ఏమి ఆనందం
ఈరోజుతో కష్టాలు తీరాయి
భూమి పైపొరలు తేమ నిండాయి
ఆహారం లేక అలమటిస్తున్నాము
పైపొరలకెళ్ళి ఆనందంగా ఉందాము
అని చెప్పాలనుకున్నా
కానీ..........ఆగిపోయాను
గతం..... ఓ పీడకల
నా సోదరి వానొచ్చిన ఆనందంతో
సకుటుంబంతో భూమి పై పొరలకు వెళ్ళనపుడు
అమ్మో ! తలచుకుంటే భయమేస్తుంది
ఒక రాకాసి బండి
కత్తుల చట్రానికి
ముక్కలుముక్కలై
కుటుంబమంతా బలి అయ్యింది
అమ్మో! ..ఎలా?....ఏది దారి?
నాడు.....
నాగలి దున్నినపుడు
కొర్రుల మద్యకి...కిందకి వెళ్ళి
ప్రాణాలు నిలుపుకొంటిమే
నేడు.....
అవకాశం ఆవగింజంత లేదు
పైకెళ్తే ప్రాణాలు హరీ
దేవుడా ఏది దారి?
మాజాతి ఇలా అంతరించాల్సిందేనా ?
మమ్మల్ని కాపాడేవారు లేరా?
జీవ కారు ణ్య సంఘాలు ఎక్కడ?
కళ్ళముందు కనిపించేవే జీవాలా?
మేము జీవులం కాదా?
ఇన్ని నాళ్ళూ మా జీవ ఎరువుతో
బంగారు పంటలు పండించినారు
ఇప్పుడు మా మృత జీవాలపై పండిస్తున్నారు
ఇంత దయ లేని వారా మానవులు?
భగవంతుడా మాకు నీవే దిక్కు! "
**************************
sk101_05 అనుసూరి వేంకటేశ్వరరావు
మనుషులంతా ఒక్కటే
లౌకికమే అభిమతం
కావాలి మనమతం
కులమేదయినా
మతమేదయినా
మానవత మించిన మతముందా
మనిషి మనిషిగా బ్రతకాలి
మానవతకు ప్రతీక కావాలి
కుల"గజ్జి"అని ఎప్పుడో ...చదివిన గుర్తు
నవ్వుకున్నానప్పుడు పదప్రయోగానికి
"గజ్జి " పదం సరైందేనని
అంటువ్యాధి లా వ్యాపిస్తుందని
తెలిసిందీనాడు కులం పేరుతోవిచ్చిన్నమవుతున్న
సంఘజీవనం చూసి
పతనమవుతున్న మానవ విలువలు చూసి
సొంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడవోయ్
ఆనాటి మాట
సొంత లాభం కోసమని పొరుగు వాడిని దోచుకోవోయ్
ఈనాటి బాట
హద్దూ అదుపూ లేని సమాజ విచ్చిన్నతలో
చివరికి మిగిలేది నువ్వూ నేనే
అదే మనిషి స్వార్దానికి పరాకాష్ఠ
ఏమతమైనా
మారణహోమం కో రుకోదు
అన్ని మతాలు కోరేది
సర్వ మానవ కళ్యాాణము
సర్వ మానవ సౌబ్రాతృత్వం
మనుషులను ఇన్ని విధాలుగా
విడగొట్టే వారికి సవాల్
ప్రాణికోటికి పంచభూతాలే
అనుబంధం ప్రాణం
మీరు విడగొట్టే ప్రతి ముక్క సంఘానికి ,కులానికి లేదా మతానికి
పంచభూతాలను విడగొట్టి సమంగా పంచగలరా?
అసాధ్యం !
అందుకే సమాజ విచ్చి న్నం వద్దు
మనుషులంతా ఒక్కటే అంటే ముద్దు
***************************
sk101_6 అనుసూరి వేంకటేశ్వరరావు
బంగారం
ఒక మంచి సందేశం
నీలో అలజడి రేపితే
తెరచి చూసుకో నీ హృదయాన్ని
మలినాలన్నాయని
మలినం లేని మనసే
24 క్యారట్ బంగారం
చైన్ స్నాచింగులకు చిక్కనిది
దోపిడికి దొరకనిది
దొం గలకు అందనిది
అందుకే నీ మనసు శుద్ది చేసుకో
బంగారం గా మలచుకో
అంతకు మించిన ఆభరణం లేదు
నీ మనసే శాంతికి నిలయం
దాన్ని మించ లేదు ఏ దేవాలయం
*************************
sk 101 - 07 అనుసూరి వేంకటేశ్వరరావు
** వెలుగుతున్న భారతం! *
వెలుగుతోంది భారతం
కోటి దీపాల వెలుగు కాదది
కోటి అగ్ని శిఖల ప్రజ్వలిత కాంతి
నూరు కోట్ల ప్రజా హృదయ క్రాంతి
జాతి పిత గాంధీ కలలు కన్న పల్లె స్వరాజ్యం ఏది ?
స్వరాజ్య సమయానికే పల్లెలు వెలుగుతున్నాయ్
బాటలు లేకున్నా పాడి పంటలతో వెలిగాయి
గ్రామీణఉత్పత్తుల గిరాకీతో వెలిగాయి
మనసు నిండా బంగరు భవిష్యత్ ఆశలతో వెలిగాయి
జై జవాన్! జై కిసాన్ ! నినాదం
ప్రభుత్వ కార్య శూరత్వానికి వివాదం
ఏడు దశాబ్దాల ప్రగతి
ఏమున్నది గర్వకారణం
ఎక్కడున్నది భారతీయత
కులాల పేరిట మతాల పేరిట
ముక్కలు చెక్కలయ్యె భారతీయులు
విభజించు పాలించు నాటి తెల్లవాడి రాజకీయం
విభజనలను విభజించు పాలించు నేటి రాజకీయం
అన్నపూర్ణ భరతావనిలో
పల్లె ఎలా వెలుగుతుంది ? చూడండి!
పేదరైతు జోలె పట్టాడు
భిక్షకోసం కాదు
అప్పుకోసం
కాలే కడుపు నింప కాడి పట్టి
దుక్కి దున్ని నాట్లు పెట్టి
చేస్తే వ్యవసాయం
ఏదీ ఫలసాయం ?
ఏదీ గిట్టుబాటుధర?
అప్పు అంతితై కొండంతై
బూచిలా భయపెడుతుంటే
నిద్ర లేని రాత్రులు
నిశా రాత్రులు.. నిశాచరాల్లా భయాందోళనలతో
బ్రతుకే ఒక పీడకలలా పీడిస్తుంటే
బ్రతుకు భారమై.. భార్యా పిల్లల కనులార చూసుకొని
కంటి నీటితో మసకైన చూపుతో
పెరటిలోనికి వెళ్ళి గోమాతను కౌగలించుకొని బోరున ఏడ్చి
లేగదూడ చెంతచేరి ముద్దాడి
తల్లి చెంతకు చేర్చి కన్నీటి పర్యంతమై
తెల్లవారి కనిపించె ఉరికొయ్యకు ఉసురు కోల్పోయి
అవును ! కాదని ఎవరన్నారు? వెలుగుతుంది భారతం
పేదరైతుల చితిమంటల వెలగుతో!
జైకిసాన్ శ్రధ్ధాంజలి దీపాలతో!
**********************
sk101 -08 అనుసూరి వేంకటేశ్వరరావు
* వెలుగుతున్న భారతం! 2 *
వెలుగుతుంది భారతం
పల్లెలు వెలుగుతున్నయ్
ఆత్మాహుతి రైతుల చితి మంటల కాంతిలో
శ్రధ్ధాంజలి దీపాల వెలుగులో
వెలుగుతుంది పల్లె భారతం
మరి పట్టణాలూ వెలుగుతున్నయ్
ఎలా??
బాలానందాన్ని అటకెక్కించి
"బరువైన"చదవులతో చమురులేనిదీపాలతో
వెలుగుతుంది పట్టణభారతం
కౌమారంలో భాధ్యతలెరుగని
భావి భారత పౌరులు
హుక్కా మత్తులో చిత్తై
మందు విందు చిందుల తో
పబ్బుల డిస్కో క్లబ్బుల కాంతులతో
వెలుగుతుంది పట్టణ భారతం
పల్లెరైతు విద్యుత్తు పణంగా
నవరత్న కాంతులతో
కాంక్రీటు అరణ్యాన పూసిన
నక్షత్రపూవుల వెలుగులతో
వెలుగుతుంది వట్టణభారతం
నిత్యకర్మల కోతలతో
ఉరుకు పరుగుల బ్రతుకులతో
మమత ప్రేమానురాగాల
పరిమిత పంపిణి తో
వెలవెల బోతున్న కుటుంబ విలువలతో
వెలుగుతుంది పట్టణభారతం
కాంక్రీటు కంబళి క్రింద భూమాత నోరెండ
అంతర్వాహినికై ఎదురు చూడ
నాలాల ఆక్రమణతో దారి లేని గంగ
రహదారులం బారి
చెట్టును పుట్టను లేక
పట్టణ పౌరులకు
జీవనము నరకప్రాయమై
వెలుగుతుంది పట్టణ భారతం
అఛ్చాదన సంస్కృతి అటకె క్కి
కురచదుస్తుల పాశ్చాత్య కుసంస్కృతి అందలమెక్కి
మహిళల పట్ల నేరాల చిట్టా
ఎవరెస్టుకు పోటీ పడుతూ
తోడు నీడ భావన లేక
చిరు కట్న వరకట్న బాధల పీఢలతో
ఛిద్ర మౌతున్న సంసారాలతో
కన్న పేగు కడతేర్చే కసాయి తండ్రులతో
వెలుగుతుంది పట్టణభారతం
కని విని ఎరుగని కలకంటి
కంటిదీపాల కన్నీటి కాంతులతో!!!
*************************
sk 101 -09 అనుసూరి వేంకటేశ్వరరావు
* శీర్శిక: ఎల్ నినో *
************
పారిశ్రామికీకరణ మత్తులో జోగుతున్నది ప్రపంచం
టెక్నాలజి టెక్కుతో విర్రవీగుతున్నది
పర్యావరణపరిరక్షణ తుంగలో తొక్కిన
పర్యవసానం?? "ఎల్ నినో"
తరుముకొస్తున్నది "ఎల్ నినొ"
భూమద్య రేఖాంశ హారమున
ప్రపంచవ్యాప్త అసాధారణ వాతావరణం అనివార్యం
ఆరంభంలోనే దాల్చెను తీవ్రరూపం
అడుగంటెను జలం జలాశయాలకు అభిశాపం
ఏమౌనో జలచరాలు పాపం
సాగుకు అనుకూలించని వాతావరణం
ప్రతికూలించే ఫలసాయం
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు
రైతుల బతుకులు పై మరో ప్రకృతి దాడి
పొగమంచున సిరుల సింగపూర్
ఫసిఫిక్ లో తూఫాన్లు
వియత్నాంలో ఎండనున్న జలాశయాలు
నీటి కటకటతో కన్నీటి బొటబొట
కోకో పంటల ఆఫ్రికా
దిగుబడి కోతలు తో రైతుల వెతలు
పశుపక్షాదులపై ప్రభావం ...పర్యవసానం?
పాడి పంటల అర్జంటినా క్షీర పంట క్షీణత
కరవు రక్కసి కోరల్లో చిక్కనున్న ఆస్ట్రేలియా
కాలిఫోర్నియాలో
నాలుగేళ్ళ అనావృష్టి అతివృష్టిగా రూపాంతరం
ప్రకృతి విలయాలనాప తరమా మానవులకు
తుఫానులు........ వాయు విలయాలు
సునామీలు ........జల విలయాలు
భూకంపాలు........భూమాత విలయం
కార్చిచ్చులు.........అగ్ని విలయం
ఊల్కాపాతం.......ఆకాశ విలయం
పంచభూతమయమైన ప్రకృతిని జయించ మానవతరమా
అందుకే ఈ విశ్వ సృష్టి స్తితిలయలు
మానవుల నియంత్రణలో లేవు.....రావు !
రానున్న విలయ ప్రళయాల నుంచి రక్షణకు
పంచభూతాలను పూజించి ప్రసన్నం చేసుకుందాం!
*************************************
sk 101_ 10 అనుసూరి వేంకటేశ్వరరావు
* కెరటం *
ఆనాడు... మనసుతాకిన కెరటం నువ్వు
ఆ కెరటానికి ఎగసి పడిన మనసు తుళ్ళింత లో
ఆనందం ఆర్నవమైన వేళ
నీ చూపులు మన్మధబాణాలై నను తాకిన వేళ
నీ మోమున విరిసిన నవ్వు నా గుండెలో పదిలమైనది
ఆనవ్వులే నా పై కురిసాయి సిరి మల్లెల జల్లుగా
ఆ సిరిమల్లెల జల్లులో విరిసింది ఓ హరివిల్లు నీ ప్రేమగ
ఒంటరినైన వేళ నీ తలపుల తోడుగా సహజీవనం
నన్ను నిత్యశక్తివంతుడిగ చేస్తే
నిను చూడాలన్న తపన నన్ను నిత్యం వేధిస్తుంది
నా ఎడారి జీవితంలో ఒయాసిస్సువయ్యావు
ప్రేమ దాహం తీర్చి కనుమరుగై ...
నా మనసున దేవతవై నిలిచావు !
*************************
sk 101- అనుసూరి వేంకటేశ్వరరావు
ముందుమాట: తెలుగు భాష ఘనత చాటగ తెలుగు కవుల
సహస్ర కవి సమ్మేళనం 18నవంబరు2015 సహస్ర కవుల విజయ దినోత్సవం నాడు వాట్సప్ వేదిక గా ఆవిష్కృతం కానుంది కవులందరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఈకవితా స్వాగత మాల
**************
కదలిరండి !
కదలి రండి ! కదలి రండి ! కవులారా! కదలిరండి
పదం కదిపి కలం దులిపి
కవితా మాలికలల్లగ... కదలిరండి...కదలి
శారదాంబ బిడ్డలమై
తెలుగు భాష ద్రష్టలమై .....
కలం గళం వినిపించగ
కవితామాలికలల్లగ.....కదలిరండి
దండుగా కదలిరండి ఉద్దండ పండితులై .....దండుగా కదలి
సమాజాన వెదజల్లిన విషబీజాలెన్నెన్నో
ఏరివేసి పారబోసి ప్రక్షాలన జేయబూని
కలం దూసి కవిత రాసి ......కదలిరండి ..రండి......
భావజాల వర్షంలో తడిసి పావనమవ గా.....కదలిరండి ..
పదం కదిపి కలం దులిపి కవితామాలికలల్లగ
కదలి రండి ! కదలిరండి! కవులారా కదలిరండి
తెలుగుభాష విజయోత్సవం
తెలుగుకవుల నేత్రోత్సవం
కనులారా వీక్షించగ ........కదలిరండి .......కదలిరండి
తెలుగు కవుల కలలన్నీ
సాకారం చేయగా..
మీకోసమె ఈవేదిక కవితా అభిలాశిక ....కదలిరండి
తెలుగు కవిత కమనీయం
తెలుగు భాష తేనీయం
కన్న భాష తెలుగు భాష
అన్న మాట మరువకండి .......కదలిరండి ........కదలిరండి
కలం బూజు దులపండి
కుళ్ళును కడిగేయండి ....కదలిరండి ... ........కదలిరండి
వాట్సప్ వేదికగా
వేడిగా...... వాడిగా ....వడివడిగా ....... కదలిరండి........
నిరవధిక కవితలతో తెలుగు భాషకభిశేకం ....
జిలుగు వెలుగు కవితలతో
తెెలుగు మాతకభిశేకం చేద్దాం.. రారండి ...రండి...రండి
కదలిరండి ! .కదలిరండి! కవులారా..! .కదలిరండి !!
పదంకదిపి కలం దులిపి కవితామాలికలల్లగ
కదలిరండి! కదలిరండి ! కవులారా కదలిరండి!
**********************************
sk101-12 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
పుష్ప విలాసము
అందమైన పూ తోటలో
ప్రభాత కిరణాల వెలుగులో
రంగురంగులతో మీ కనువిందు చేస్తాము
మా జీవితం చిన్నదయినా
ముగ్ద సుకుమార సుగంధ మకరంద మధుర జీవితం మాది
విరించి ప్రకృతి రచనలో మధుర పాత్ర మాది
మానవులకు దేవతలకు సేవకోసం
జన్మంచిన పుణ్య జీవులం మేము
ఉద్యాన వనాల్లో విరగబూసి
మధుర సుగంధాలు వెదజల్లుతాము
మీ పాపల మోమున విరిసే ఆనందపు నవ్వులు చూసి
మీ మోములు వికసిస్తే మా మనసున ఆనందం అతిశయమౌతుంది
" పుష్పాంజలి" నాట్యం
అమృతవర్షిణి రాగం....ఆదితాళంతో
సంపూర్ణం కాదు మేములేకుండా
నాట్యకత్తెలు దోసిట మమ్ము నటరాజుకర్పించ
మా జన్మ ధన్యమగును
పూజకోసం పుట్టిన పువ్వులం మేము
పూదోట విరిసేటి నవ్వులం మేము
బతుకమ్మల చేరి కనువిందు చేస్తాము
అమ్మవారి పాదాల చేరి పావనమౌతాము
మీ మానవుల తొలిప్రేమపూజకు (శోభనం)
పూల పాన్పు అవుతాం
అంతిమ యాత్రలో పూలదండ అవుతాం
పూసే ప్రతి పువ్వు వాడుతుంది
వాడిన పూవులు పూజకు పనికిరావు !
****************************
sk101-13 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
తొలిపొద్దు
దున్న భూమి ఉన్నా దూర ప్రయాణమెందుకు?
పట్నం పోయి పార పడతావెందుకు ?
గల్్ఫ కి పోయి శవమౌతావెందుకు?
దుక్కి దున్న నాగలి పట్టవెందుకు ?
మూడెకరాల నీ కల సాకారం చేసింది ప్రభుత్వం
బంగారు తెలంగాణ కల సాకారం చేయవా ?
పొడిచే తొలి పొద్దువి నువ్వే !
ఆకాశమె హద్దుగా అభివృద్దిని సాధించు
ఎవరో వస్తారని కలలెందుకు నీకు ?
ఏదోచేస్తారని ఎదురు చూపులెందుకు నీకు?
నీ భుజ శక్తిని నమ్ముకో అదే శ్రీరామ రక్ష నీకు !
రాజకీయ నాయకులారా!
మీరు గతికే ప్రతి మెతుకు వెనక
పేదరైతు స్వేదం ఉందని మరువకండి !
లక్ష్మీ పుత్రులు మీరయితే
జేష్టా దేవి పుత్రులు వీరు
దరిద్ర దేవత కనుసన్నల్లో
దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు
అందరికి అన్నం పెట్టే రైతే అన్నమో రామచంద్రా అంటే?
రేపటి కరువుకి మీరే బాధ్యులు !
అందుకే రైతుల్లో స్ధైర్యం నింపండి !
శవాలు సేద్యం చేయలేవు
కనుక ఆత్మహత్యలాపండి !
చచ్చిన శవాల పై పూదండలతో లాభమేమి?
ఋణ మాఫీలతో లాభమేమి?
ఋణమేమి అవసరం లాభదాయకత ఉంటే
గిట్టుబాటు ధర కల్పించి
వ్యవసాయమూ లభదాయకమని చాటండి!
మొద్దునిద్ర వీడి మేల్కనండి!
ఆలస్యం బీడునేల మరుభూమి!!!
******************************
sk 101-14 అనుసూరి వేంకటేశ్వరరావు .హైదరాబాదు
5/11/15 కిరణ్మయి గారిచే పాడించి సహస్రకవుల గ్రూపు లో పోస్ట్ చెయ్యబడినది
నవవసంతం
పల్లవి: నవవసంతం వికసించింది
కవులతోట పులకించింది
ప్రతీచెట్టూ కొత్త కాంతులు విరజిమ్మింది
చరణం: చిగురు తొడుగతున్న కొత్త ఆకులూ
కోటి సూర్య ప్రభల కాంతి దీపాలూ
అల్లంత దూరాన అందాల తోట
ఇంకెెంత దూరాన చైతన్య బాట
ఇంద్రధనుస్సు అందాలు చిందులేసి పాడగా
...నవవసంతం
చరణం: సాహితీలోకాన వెలసిన కవుల తోట ఇది
వర్ధమాన కవులకు పూలబాట ఇది
" రవి" కిరణం సోకి తరులు పులకించి
ఆకలి తీర్చుకుంటున్న తరుణమిది
ఫలించి ఆకలి తీరుస్తున్న కవనమిది
....నవవసంతం
చరణం: కవులతోటలో కవితావృక్షాలు ఊడలేసి
అంతింతై వటుడంతై అన్న చందంగా
కొత్త మొలకలకు ప్రాణం పోస్తున్నవీ
కొత్తమొలకలు దిన దినప్రవర్ధమానమై
క్రొంగొత్త ఫల పుష్పాలనిస్తున్నవీ
వేయికవులసంగమానికిస్ఫూర్తినిస్తున్నవీ
నవవసంతం వికసించింది
కవులతోట పులకించింది
ప్రతిచెట్టూ కొత్తకాంతులు విరజిమ్మింది
****************************************
sk 101-16 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
మరో దీపావళి
ఎక్కడోపుట్టాము ఎక్కడోపెరిగాము
సరస్వతీ మాత సేవలో
సాహితీ వనంలో కలిసాము
గ్రామాలుదాటి జిల్లాలు దాటి
రాష్ట్రాలు దాటి దేశాలుదాటి
ఖండాలు దాటి వాట్సప్ వేదికగా
జగదైక తెలుగు కుటుంబం అయ్యాము
ఈ సాహీతీ వనంలో ఎన్నెన్నో వృక్షాలు
కొలువుతీరి ఉన్నాయి
ఎన్నో ఎన్నెన్నో పుష్పిస్తున్నాయి
సుగంధ సుమధుర సాహితీ పరిమళాలు
విశ్వంలో వెదజల్లుతున్నాయి
సమున్నత మధుర భావ ఫలాలనిస్తున్నాయి
పాటలు, పద కవితలు, పద్య కవితలు
గజల్లు, చందోబద్ద కవితలు
చంపక మాలలు, కంద,సీసాలు
ఆటవెలది ,మత్తేభ,శార్దూలాలు
రూపమేదైనా తెలుగు సాహితీ
సౌరభాలను ఖండాతరాలలో వెదజల్లుతున్నాయి
తేనెలొలుకు తెలుగు భాష మాధుర్యాన్ని
జగత్తులో వ్యాపింప జేస్తున్నాయి
18 నవంబరు నాడు వాట్సప్ వేదికగా
మరో దీపావళి పండుగ జరుగనుంది
ప్రపంచ వ్యాప్త సహస్ర కవులు
కవితల దీపాలతో తెలుగు కళామతల్లికి
నీరాజనాలు అర్పించనున్నారు
ఆ దీపాల వెలుగు సమాజానికి ప్రగతి బాట చూపనున్నది
చెడు పై మంచికి విజయ బాట వేయనున్నది
విజయ బావుటా ఎగురవేయనున్నది
మరోదీపావళికి నాంది కానున్నది
*********
పై కవిత నా స్వంతం దేనికి అనువాదం లేదా అనుకరణకాదు
ఇదివరకు ప్రచురణకు పంపియుండలేదు
అనుసూరి వేంకటేశ్వర రావు 7/11/2015
********************************
sk101-17 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
* పత్తి రైతు *
తెల్ల బంగారం
ఔను తెల్ల బంగారమే!
అది ఒకప్పుడు
పత్తి పండిందంటే రైతు "పంట" పండినట్లే
బంగారం చేతికందినట్లే
పంట పండక పోతే?
ఆ ఊహే రైతుని వణికిస్తుంది
చేసిన అప్పులు కొండంతై
తీర్చే మార్గం కానరాక దిక్కు తోచక
పురుగును చంపిన మందే దిక్కవుతుంది
ఉరితాడే యమపాశమౌతుంది
పంట పండినా!
పత్తి రైతులు చిత్తవుతున్నారు వ్యాపారుల చేతుల్లో
వీరి అమాయకత్వమే వారి మోసానికి ఆసరా
బురిడీ కొట్టించి బుట్టలో వేస్తారు
నాణ్య త పేరిట ఒకమోసం
తూకం పేరిట ఒక మోసం
అధికారులు వ్యాపారులు
చేయి చేయి కలిపి భాయి భాయి అనుకుంటారంటారు
కాటన్ సిండి"కేటు"గాళ్ళంటారు
ప్రకటించిన ధర చూసి మిల్లుకి వెళితే రైతుకి శఠగోపం
సౌకర్యాలు లేని మార్కెట్లలో బహిరంగదోపిడికి గాలం
అన్నిసౌకర్యాలు కల్పిస్తామన్న
అధికారుల మాటలు నీటిమీద రాతలే
రైతులకు, నోరులేని పశువులకు
మంచి నీటి సౌకర్యాలు లేవు
అస్తవ్యస్తమైన రోడ్లు వెరసి
అస్తవ్యస్తమైన పత్తి రైతు బ్రతుకు
అందుకే ...... కావాలి కావాలి ఆసరా
ఋణమాఫీలు కాదు గిట్టుబాటుధర కావాలి
హామీలు కాదు మంచి విత్తన పంపిణీ కావాలి
కధలు చెప్పటం కాదు కనీస విద్యుత్తు కావాలి
కావాలి కావాలి మౌలిక సదుపాయాలు
వ్యాపారులారా ........ అధికారులారా ....
నీతి ... నిజాయితి లు పాటించండి
రైతుని నట్టేట ముంచకండి
ఫ్రకృతిని మీరు శాసించలేరు
ప్రకృతి వైఫల్యాలనుండి రైతును మీరు కాపాడలేరు
మీరు చేయగలిగే సాయం మీరు చేయండి చేయూతనివ్వండి
పేద రైతుల ఉసురు తీయకండి ఊరడించండి
రైతు ఆత్మహత్యలు దేశప్రగతికి గొడ్డలి పెట్టు
రైతన్నా!
నీ చుట్టూ అల్లుకున్న సమస్యల వలయంలో
నీవున్నావని తెలుసుకో
నీ కష్టాన్ని దోచుకునే గుంటనక్కలున్నాయి
అనుక్షణం నిన్ను పీక్కు తినే తోడేళ్ళున్నాయి
నీ నోటి కూడు తన్నుకు పోయే రాబందులున్నాయి
లే ! నిద్ర మత్తు విడిచి జూలు విదిల్చి సిద్దంకా! సింహం లా !
అలుపులేని పోరాటానికి నీవు చేసే సింహ నాదం
తోటి రైతులకు పిలుపు ప్రభుత్వానికి మేలుకొలుపు
పోరాడితే పోయేదేమీలేదు రైతుల ఆత్మహత్యలు తప్ప
ఆత్మహత్యలతో వచ్చేదేమీ లేదు మరో ఆత్మ హత్య తప్ప
ఆత్మీయుల ఆత్మఘోషతప్ప!!
సమస్యేదైనా కాదు పరిష్కారం ఆత్మహత్య
నిలదీసి అడుగు అప్పుకాదు !
అప్పు మాఫీ కాదు !
సమస్యకు పరిష్కారం !
అలుపెరుగని పోరాటంతో సమస్యలన్నీ
తెల్లమబ్బులా తేలిపోతాయి
అంతిమవిజయం నీదే !
* ఈ రచన నా స్వంతం దేనికి అనువాదం అనుకరణకాదు ఇదివరకు ప్రచురణకు పంపలేదు.* అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు 10/11/2015
****************************************
sk101-20 అనుసూరి వేంకటేశ్వర రావు,హైదరాటటబాదు
ఈ రచన నా స్వంతం దేనికి అనువాదం కానీ అనుకరణ కానీ కాదు
ఇంతవరకు ప్రచురణకు పంపలేదు అవి హామీ ఇస్తున్నాను
కళ్ళు
చూస్తే ఆ "కళ్ళు"
తిప్పలేము మన కళ్ళు
ఆయన కనిపించే సీను
కురిపిస్తుంది హాస్యపుజల్లు
మొక్కవోని దీక్షాపట్టుదలలకు తార్కాణం
నాటకాల మోజు అప్పుల పాల్జేస్తే
సినిమా సి"తార" ను చేసింది
తొలి చిత్రం లోనే నంది పురస్కారం
"కళ్ళు" నటనే దానికి తార్కాణం
" కళ్ళు" చిదంబరమయ్యాడానాడే
త్రిశత చిత్రాల హాస్యవినోదం
తెలుగు ప్రేక్షకులకు అతిశయ ఆనందం
1600 మంది కళాకారుల సకల కళల సమాఖ్య స్థాపన
ఆయన కళా తృష్ణకు తార్కాణం
ఆ కళ్ళు... ఇక కనిపించవు అన్నభావన
హాస్య రసాస్వాదికులకు వేదన
కనరాని లోకాలకేగిన ఓకళాత్మజ !
అందుకోవయ్యా మా హార్దిక నివాళి !
*****************
(1/11/2015 తెలుగువేదిక.నెట్ 7 వ
సంచిక లో ప్రచురిత మైన కవిత)
***********************************
sk101-22 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
నవంబరు 11న " జాతీయ విద్యా దినోత్సవం "
భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్
జన్మదినం సందర్బంగా
*విద్య*
ప్రాధమికంలో చిన్న నీటి జాలు లా మొదలై
ఉన్నతంలో ప్రవాహమై ఆఖరుకు అలలా ఎగసి పడేదే విద్య
భవిష్య భారత నిర్మాణానికి పునాది రాళ్ళు నేటి బాలలే
నేటి బాలలే రేపటి పౌరులు
ఉత్తమ విలువల విద్యా బుద్ధలు
ఉత్తమ విద్యా విధానం నెలవైన
పాఠశాలలు విద్యాలయాలు భవిష్య భారత నిర్మాణ దేవాలయాలు
విద్య బహుముఖ లక్ష్య ఫలప్రదాయని
ఉద్యోగమొక్కటే కాదు దేశభక్తి, దేశరక్షణ,
ప్రేమ ,కరుణలు పెంపొందించటం
మానవత్వం నింపటం విజ్ణానం పెంపాదించటం
సామాజిక అంశాల అవగాహన, స్పందనలు
ఒక జాతి గౌరవం విద్య
ఒక దేశగౌరవం విద్య
విద్య లక్ష్యం ఉత్తమ పౌర సమాజనిర్మాణం
విద్య సమస్త సమస్యలకు పరిష్కారం
విద్య సమాజంలోని అసమానతలను రూపుమాపేది
విద్యకు కుల మతాలు లేవు
నాడు ....విద్య కొందరికే పరిమితం
కులాల పేరిట ధనిక పేద భేధాల పేరిట
అడ్డుగోడలు ప్రగతికి ప్రతిబంధకాలు
విప్లవించిన విద్యా వేత్తలు ఆగోడలను కూల్చి
కేకలు అరుపులు రక్తం చిందని నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికారు
విద్యాధికుల వివేకానికి విజయనాదమిదే
విద్యలేని వాడు వింత పశువు
విద్య నేర్చిన వాడు విద్వాంసుడు సామాజిక మార్గదర్శకుడు
విద్యతో మనిషి కొత్త జన్మ ఎత్తుతాడు
సామాజికంగా ఆర్ధిక ప్రగతికి తొలిమెట్టు విద్య
నేడు ... సమాజంలో కొన్ని చదువుకున్న మృగాలున్నవి
అక్షరాస్యత అందలమెక్కిస్తుంది
మహిళలందరూ సరస్వతీ పుత్రికలవ్వాలి
ఆ మృగాల కోరలు పీకాలి
నాణ్యత లేని విద్య నాటు విద్య , చేటు విద్య
పరిపక్వత లేని విద్య పనికిరాని విద్య
సర్వశిక్షఅభియాన్ పాఠశాల విద్యకు బలం
బడులకూ నాణ్యత శ్రేణులు కావాలి
విశాలమైన గదులు ఆటస్ధలం గ్రంధాలయం
ప్రయోగశాలలు బట్టి గ్రేడింగ్ కావాలి
రాష్ట్రవిద్యా పరిశోధన శిక్షణ మండలి నేతృత్వాన
పాఠశాల విద్యా ప్రమాణాలు అంబరాన్ని తాకాలి
ఉన్నత భారత్ అభియాన్ కాలేజి విద్యకు బలం
విద్యార్ధిని తీర్చి దిద్దే భాద్యత ఉపాధ్యాయుడిదే
గురుః భ్రహ్మ గురుఃవిష్ణు గురు దేవో మహేశ్వరః
భావిసమాజ నిర్మాణ గురుతర భాధ్యత గరువులదే
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుంది
యువభారత్ నైపుణ్యాన్ని పెంచుకుని
" నవయువ నైపుణ్య మహా భారత్" ను నిర్మించి
" మేరాభారత్ మహాన్ " అని చాటాలి
*************
*పై రచన నా స్వంతం దేనికి అనువాదం అనుకరణకాదు
ప్రచురణకు పంపలేదు .....అనుసూరి వేంకటేశ్వర రావు
******************************************
sk101-23అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
దీపా--ఆవళి
ఆశ్వయుజమాసాంత మప మృత్యవారంభం
మూడు నాళ్ళ ముచ్చటైన పండుగ
"బలిత్రయోదశి"నాడు యమదీపదానంతో మొదలై
" నరకచతుర్దశి " ప్రాతఃకాల నదీ స్నానం
నక్షత్ర కాంతి శక్తి ,
ఉషఃకాంతి శక్తి ,
నీటి అధిష్టాత వరుణశక్తి
సప్తఋషుల అనుగ్రహ శక్తి
అంగీరాది మహర్షుల తపఃశక్తి
నదీ ఔషదశక్తి
నదీమృత్తిక శక్తి
సర్వ శక్తి మయం నదీీ స్నానం
లోక కంటకుడు నరకుని వధతో
మరునాడు మహా పండుగ "దీపావళి"
దిగంతాల వ్యాపించేలా దీపాల ఆవళి
మనుజ లోకాన ఆనంద హేళ
ముంగిట రంగవల్లులు మామిడాకు తోరణాలు
ద్వారాలకు పూదండ మాలలు
తలంటు స్నానాలు సాంబ్రాణి ధూపాలు
బాలికల పూలజడల జడగంటలు
నూతన వస్త్రాల ముస్తాబు సంబరాలు
ఆధ్యాత్మికానందంలో భక్తి ప్రపత్తులతో లక్ష్మీ పూజ
పూజగది మంగళారతుల గుడి గంటలు
నోరూరించే మిఠాయిలు
పచ్చిపులుసు అత్తెసరు
పొంగలి .. పులిహోర
ఆహా! పండగంటే ఇదేనా !
సూర్యాస్తమయం తో చీకట్లు ముసిరే వేళ
బారులు తీరిన దివ్వెల వరుసలు
ప్రపంచానికి ప్రేమను పంచే వెలుగులు
చీకటిని (చెడును)పారద్రోలే వెలుగుల జిలుగులు
రంగుల వస్త్రాల్లో పొంగే ఆనందంలో పిల్లలకేరింతలు
మదినిండా సంతోషపు వెలుగులు నింపే చిచ్చుబుడ్లు
విషాదాలు కష్టం కన్నీళ్ళు పారిపోయేలా మతాబాల పేలుళ్ళు
ఐశ్వర్యం ఎదుగుదలకు హద్దులు చూపేలా రాకెట్ల విన్యాసాలు
పండగేదైనా పరిమితుల్లో ఉండి పర్యావరణాన్ని కాపాడాలి
వెలుగుల పండుగ అందరి జీవితాల్లో వెలుగు(సంతోషం) నింపాలి
ఈవెలుగులే రేపటి సహస్ర కవి సమ్మేళనంలో
ప్రతి కవి ముఖాన ప్రతిబింబించాలి
****************************
sk101-24 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
10/11/2015
* ఆధారం *
నీట మునిగే వానికాధార మగును
గడ్డిపోచ గరికె గాఢముగాను
సాహితీ నదినీద నీకేల గడ్డి గరిక
"సహస్ర కవుల" నావ నీకు తోడుండగ
*****************************
sk 101-25 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
ముందు మాట:ధర్మార్ధ కామేషు త్వయైషా నాతి చరితవ్యా
అనే కన్యాదాత అభ్యర్ధనకు వరుడు" నాతి చరామి" అని
చేసే ప్రణామాన్ని మరిచి మద్యలోనే భార్య చేయి విడిచి
వెళ్ళే సందర్భంలో ఓ సతి విలాపమీ తీరునుండు
* పాణిగ్రహణం *
నా పాణి నీ పాణి గ్రహియింప
అర్ధంగినైతి భరియింప నను నీవు భర్తవైతివి
సర్వస్వమ్మర్పించి సతినైతి జీవన కృతినైతి
అర్ధంతరంబుగా పాణివీడుట పాడియే పతిగ నీకు
*************************************
sk101-26 అనుసూరి వేంకటేశ్వర రావు
సుఖదుఃఖాలు
పగలు రాతిరి వోలె సుఖదుఃఖాలు
వెలుగు నీడలు బోలు సుఖదుఃఖాలు
శీతోష్ణాలు రాగద్వేషాలు
సుఖ దుఃఖాల సమన్వయ సాధనే
మానవ జీవన పోరాటం
నిర్వికార, నిరాకార, నిర్గుణ, నిర్మలం
అయితే మన మనస్సు
బాధనే సౌఖ్యం గా పొంది
దుఃఖ బాధలేని జీవన సాఫల్యం పొందుతాము
భీష్మఉవాచ "నిందాస్తుతులను సరి సమానంగా భావించటం
నిర్వికారంగా ఉండడమే సుఖమయ జీవితానికి మొదటి సోపానం "
ఆచరణయోగ్యము
తనగొప్పను చెప్పని వాడు
ప్రతీకారేచ్చ లేని వాడు
ధర్మ మార్గాన్ని వీడని వాడు
నిజ సుఖ భోగి
సుఖదుః ఖాలు కలిమి లేములు ఆకాశాన మబ్బులు
కాలయానంలో ఋతువులు
ఏవీ శాశ్వతం కాదు
అత్యాశ అహంకారాలే గ్రహణాలు
కామ క్రోధ మద మాత్సర్యాలు
ఆవహించిన మాయా మత్తు
మత్తు గ్రహణం వీడి మనిషవ్వాలి
పాపపుణ్య ప్రవృత్తి రాగద్వేష మూలం
రాగద్వేశదోషం "మిధ్యా జ్ఞానం"
మానవ జన్మ శాశ్వతం కాదు
ఐశ్వర్యం దారిద్రం నీవెంటరావు
************************
sk101-29 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
* బాలల్లారా రండి !*
పల్లవి: బాలల్లారా రండి
భావిభారత పౌరుల్లారా రండి
పిల్లల పండుగ వచ్చింది
మనకు ఆనందం తెచ్చింది
చ1: మన చాచాజీ పుట్టిన రోజు
మనకు ఆనందం పంచినరోజు
మాతా పితలను దైవంగా కొలిచి
బ్రతుకునే బంగారంగా మలచి
కన్నవారి కలలనే సాకారం చేద్దాము
ఉన్న ఊరినే మనం స్వర్గం చేద్దాాము ...ll బాలల్లారాll
చ2: పేద గొప్ప తేడా లేదు మన బడిలో
తెలుపు నలుపు బేధం లేదు
మన మదిలో ఖేదం లేదు
కులమేదైనా మతమేదైనా
అందరము ఒక్కటై ఆన్నదమ్ములమౌదాం
చాచాజీ కలలకు వారసులమవుదాం ....llబాలల్లారాll
చ3: ఉజ్వలంగ చదువుదాం ఉవ్వెత్తున ఎగురుదాం
ఆకాశమె హద్దుగా మన భవితే ముద్దురా ...
నిరాశా నిస్పృహలకు నీళ్ళొదిలేయండీ
పట్టుదలే ఉంటే పట్టుబడును విధ్య
కృషి తోడౌతే దానికి విజయం నీ స్వంతం ...llబాలల్లారాl
******************************************
sk101-29 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
* బాలల్లారా రండి !*
పల్లవి: బాలల్లారా రండి
భావిభారత పౌరుల్లారా రండి
పిల్లల పండుగ వచ్చింది
మనకు ఆనందం తెచ్చింది
చ1: మన చాచాజీ పుట్టిన రోజు
మనకు ఆనందం పంచినరోజు
మాతా పితలను దైవంగా కొలిచి
బ్రతుకునే బంగారంగా మలచి
కన్నవారి కలలనే సాకారం చేద్దాము
ఉన్న ఊరినే మనం స్వర్గం చేద్దాాము ...ll బాలల్లారాll
చ2: పేద గొప్ప తేడా లేదు మన బడిలో
తెలుపు నలుపు బేధం లేదు
మన మదిలో ఖేదం లేదు
కులమేదైనా మతమేదైనా
అందరము ఒక్కటై ఆన్నదమ్ములమౌదాం
చాచాజీ కలలకు వారసులమవుదాం ....llబాలల్లారాll
చ3: ఉజ్వలంగ చదువుదాం ఉవ్వెత్తున ఎగురుదాం
ఆకాశమె హద్దుగా మన భవితే ముద్దురా ...
నిరాశా నిస్పృహలకు నీళ్ళొదిలేయండీ
పట్టుదలే ఉంటే పట్టుబడును విధ్య
కృషి తోడౌతే దానికి విజయం నీ స్వంతం ...llబాలల్లారాl
***********************************
sk 101-31 అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
*ఎదురు చూపులు *
తొలకకరి వర్షం కోసం
ఎదురు చూపులు
విత్తనం కోసం
ఎదురు చూపులు
దుక్కి దున్ని విత్తు నాటాక
మొలకలకోసం ఎదురు చూపులు
మొలకలొచ్చాక మరోజల్లు కోసం ..
మబ్బు కోసం ఎదురుచూపులు
చీడపీడ సోకినపుడు
ఏంచెయ్యాలో తోచక
తికమకలో నువ్వు
సలహా కోసం ఎదురు చూపులు
నీటిగండం చీడ గండం
అప్పుగండం దాటి హమ్మయ్య
అనుకునే లోపు వాన లేక చేను ఎండ
పక్క కామందు కాల్చేతులుపట్టి ఒక్కతడి పెట్టి
పంటకోసం ఎదురు చూపులు
అదను చూసి కోతకు కూలీల కోసం ఎదురు చూపులు
కూలీల బ్రతిమాలి బామాలి
అడిగినంత ఇచ్చి
పంట ఇంటికి తెచ్చి
మంచిరోజు చూసి మార్కెటుకు పోయి సరకు అమ్మ బోతే
సర్కారు ధర లోన సగం పలికే
తూకం చిక్కి తేమ బలిసి
బారెడు ధర మూరెడాయే
నిలువెయ్య సొమ్ము లేక
నీరసించి ఇంటికి పోలేక
దిక్కుతోచని దీనావస్తలో
అప్పుభూతం భయపెడుతుంటే
కంట కన్నీరొలక మసక చూపుల్లో
మనసున మెసిలిన ఆలు బిడ్డల రూపు
అసహాయత అధైర్యం మనసుని
ముసిరేస్తుంటే.....చావు వైపు లాగుతుంటే
మంచిరోజులొస్తాయన్న చిన్ని ఆశ
దీపంలా దారి చూపె
చావు బ్రతుకుల యుద్దంలో
బ్రతుకు విజయం !!!??
*********
*పై రచన నా స్వంతం దేనికి అనువాదం అనుకరణ కాదు ప్రచురణకు పంప లేదు* అనుసూరి వేంకటేశ్వర రావు 15/11/2015
********************************
sk101-32 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
అనాధ
నేనొక అనాధను
అందరూ వున్నా అనాధను
అమ్మ ఉన్నా అమ్మ ప్రేమ లేదు
ఆప్యాయత అనురాగాలకు ప్రతిరూపమంటారు "అమ్మ"
ప్రేమకు అక్షయ పాత్రంటారు
పేదరికం ఆర్ధిక చికాకుల సుడిగుండంలో
అక్షయ పాత్ర ఎండిపోయింది
చిక్కి శల్యమై అస్తిపంజర మైంది
అలాంటి అమ్మనుండి ఏమి ఆశించను
ఎండిన అక్షయ పాత్రలో ఎండుటాకులు తప్ప
నాన్న ఉన్నా నాకు ఆసరా లేదు
సంపాదన లేకున్నా సారామత్తులో జోగుతుంటాడు
కాలేకడుపుతో బడికెల్తే
కడపునిండిన ఆకలి
మనస్సుని పాఠంపై నిలువనీయదు
చిరిగిన అతుకుల బట్టలను
అదోరకంగాచూసే చూపుల భావం
తోటివిద్యార్ధుల విశాల హృదయాలకు అద్దం పడితే
స్నేహ హస్తం చాచే నేస్తం లేక...నేను అనాధనే !
ఉచితచదువుకు నీవొక అతిధివి
అన్నట్లు చూసే నా గురువుల చూపుల్లో
ఉత్సాహ ప్రోత్సాహకాలెక్కడివి?
తోటిపిల్లలు ఆటవిడుపులో
ఆనందకేరింతల్లో మనిగి వుంటే
ఆత్మన్యూనతలో నేను వారితో కలువలేక
ఎంత మధనపడి పోయానో
ఎవరికి చెప్పుకోను??
ఆకలి ఉదృతమై అన్నం బెల్లు కోసం
ఆత్మారాముడెదురు చూస్తుండగా
పండగ చేస్కో ! అన్నట్లు బెల్లు మ్రోగింది
పరుగున వెళ్ళి చాచిన పళ్ళెంలో
వడ్డించిన అన్నం పప్పులు చూసి
ఆకలి చచ్చిపోయింది
రెండు ముద్దలు కష్టంగా మ్రింగి
కడుపు నిండా నీళ్ళు త్రాగా !
కోట్లలో ఖజానాకు చిల్లు పెట్టి
పేద విద్యార్ధి కడుపు నింపలేని
పధకాలు వృధా అని గొంతు చించుకు అరవాలనిపించింది
నిన్న రాత్రి అమ్మపెట్టిన రెండు ముద్దలే అయినా
పరమాన్నంలా అనిపించింది
నా లాంటి పేద విద్యార్ధులకు
ప్రభుత్వాలు ఎన్ని పధకాలు పెట్టినా వృధా
మా జీవన ప్రమాణాలు పెరిగితే తప్ప
మా చదువులు సాగవు ముందుకు
మాకు చేయూత ఇవ్వలేని సమాజం ఎందుకు?
దశాబ్దాలు గడచినా దయనీయం మా బ్రతుకులు
***************
*పై రచన నా స్వంతం దేనికి అనువాదం అనుకరణకాదు ప్రచురణకు పంపి యుండలేదు.
**********************************
sk101-33 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
స్వాగతం సుస్వాగతం
పల్లవి: స్వాగతం సుస్వాగతం!
సహస్రకవీంద్రులకు స్వాగతం!ఘనస్వాగతం!
కవితాంజలి ఘటియించగ
హృదయాంజలి గైకొనుమా!.....llస్వాగతంll
చ1 : పారిజాత పరిమళాలతో
మరువం మల్లెల మాలలతో....llస్వాగతంll
చ2 : కవనమధువులొలికే వేళ
రస కావ్యం చిలికే వేళ
భావామృతమొలికే వేళ.....llస్వాగతంll
చ3 : రసాభావ సంగమం
కవిచేత సంభవం
ఈనాటి సంబరం
తాకేను అంబరం ....llస్వాగతంll
చ4 : రసహృదయులకు
ఆత్మీయులకు
కవిపుంగవులకు ..... ll స్వాగతంll
చ5 : కవులంతా కలం పట్టి
కవనంతో జత కట్టిన
మరో భువన విజయమిది
సహస్రకవి సమ్మేళనమిది
తెలుగు కవుల విజయోత్సవమిది...llస్వాగతంll
****************
sk101-36అనుసూరివేంకటేశ్వరరావుహైదరాబాదు
ది; 20/11/2015
శీర్షిక: హిజ్రా
సమాజం అనంతాకాశం అయితే
ఆకాశపు చివరి అంచున జీవిస్తున్నాం
విశ్వాంతరాల్లో కృష్ణబిలం అంచున
హక్కుల రెక్కలు విరిగిన పక్షులమై జీవిస్తున్నాం
హక్కులు అందరికీ ఉన్నాయి
అడవిలోని కలుపు మొక్కకైనా
వర్షపు నీటిపై హక్కుంటుంది
కలుపు మొక్కల పాటి కావా మా బ్రతుకులు
కులం..మతం..లింగ భేదాలు హక్కులకాధారమా ?
మా హక్కులు కృష్ణబిలంలోకి
మీ హక్కులు మీ ఇంటి ముంగిట్లోకా??
మా హక్కులు కాలరాసినప్పుడు
పోరాటమే మా ఆయుధం
పురుషుడు స్త్రీలై నందుకు
వివక్ష ... వేదన ....హేళన లతో
నిత్యజీవన పోరాటం మాది
అర్ధనారీశ్వరులకు పొర్లు దండాలు
మాకు అవమాన దండలా??
సహనం సంతోషాలు మా సంస్కృతి
యాచక వ్యభిచారాలు కాదు మా వృత్తి
వంచన మోసాలు కాదు మా ప్రవృత్తి
మా దీవెనలు దేవతాంశయుక్తం
మేము లేక ఏశుభకార్యము లేదు
దైవ వరప్రసాదులం మేము
మంచిపనులు చేసే సామర్ధ్యం మాకూ ఉంది
మేమూ నాయకు(రాళ్ళ)లమవుతాం
మేమూ పాలకు(రాళ్ళ)ల మవుతాం
వసంతం వాకిట్లొ మావిచిగురు రుచి ఆస్వాదిస్తూ
తన్మయత్వంతో కోయిల కూస్తుంది తీయగా
ఆ కోయిల రాగాన్ని మేమూ ఆస్వాదిస్తాం మీ లాగానే
కలలూ కోరికలూ మాలోనూ చిగురిస్తాయి నవవసంతంలా
స్పందన ప్రతిస్పందవలు మాలోను ఉన్నాయి
మాలోనూ రక్తమాంసాలున్నాయి
మాలోనూ కోపతాపాలున్నాయి
మాలోనూ సుఖదుఃఖాలున్నాయి
మాలోనూ బాధ సంతోషాలున్నాయి
మాలోనూ పంచేంద్రియాలున్నాయి
మరి మాకెందుకీ వివక్ష??
మాకు కావల్సింది మీ దయా దాక్షిణ్యాలు కావు
మా అస్తిత్వానికి గుర్తింపు
అన్ని హక్కులూ మాకు వర్తింపు
**********
అనుసూరి వేంకటేశ్వర రావు
***********
sk101-37అనుసూరి వేంకటేశ్వర రావు హైదరాబాదు
ది : 20-11-2015
శీర్షిక: స్త్రీ
రూపులేని నెత్తుటి ముద్దకు
ఊపిరులూదింది ఒక మాతృమూర్తి
మరో అమ్మకు జన్మనిచ్చింది
మహాలక్ష్మి పుట్టిందన్నారెవరో
అమ్మో ఆడపిల్లా ! అన్నారింకొకరు
హు..లోకో భిన్న రుచి !
అమ్మతనానికి ఆ బేధం లేదు
ఆడైనా మగైనా తను మాత్రం అమ్మే
ముర్రిపాలు పట్టి ముద్దుచేస్తుంది
ముద్దులొలికే మాటలకు మురిసిపోతుంది
బుడిబుడి నడకలకు వడి నేర్పుతుంది
వణికించే చలిలో తాను వణికినా
ఒడి వెచ్చదనం పంచుతుంది
బారసాల సంబరాలు మొదలు
శైశవాన అమ్మను మురిపిస్తుంది
బాల్యంలో సోదరులను ఆటలతో మరిపిస్తుంది
కన్యగా కవుల కలలలో కలంలో
సౌందర్య సొబగులద్దుతుంది
అందాల హరివిల్లై సిరిమల్లెల నవ్వై
మందారంలా విరబూస్తుంది
అన్నదమ్ములకు ప్రేమానురాగాల రక్షాబంధనమౌతుంది
అక్కాచెల్లెళ్ళ కు అనురాగ సాగరమౌతుంది
కట్టుకున్నవాడి కోసం కన్నప్రేమకు దూరమౌతుంది
మెట్టినింటి గౌరవాన్ని దీపంగా తలదాల్చుతుంది
అత్తమామల ఆరళ్ళు
ఆడపడుచు వెక్కిరింతలను
పిల్లచేష్టలుగ భరిస్తుంది
మెట్టినింట కటిక నేలనే
పుట్టింటి ఫోమ్ బెడ్ లా భావిస్తుంది
ఆదర్శఇల్లాలై భర్తకు సేవలు చేస్తుంది
కష్టసుఖాలలో తోడునీడైనిలుస్తుంది
వేణ్నీళ్ళకు చన్నీళ్ళా
సంపాదనలోభర్తకుచేదోడువాదోడౌతుంది
ఇంటిపనులు ఉద్యోగం జోడుగుర్రాల స్వారీ
అలసట ఆందోళన ఆవేశాలు దరిచేరకుండా
భూదేవంత ఓర్పుతో నిర్వహించే శాంతమూర్తి
వంటా వార్పుతో
రుచుల చేర్పుతో
మాటల నేర్పుతో
వండి వడ్డించి తినిపించి
కుటుంబంలో ఆనందమే తన ఆనందమై
శ్రమ ...వత్తిడికి అందం ఆవిరైపోయినా
ఆరోగ్యం కొవ్వొత్తిలా కరిగిపోయినా
భాద్యత మరువని త్యాగశీలి
భేషజమ్ముల విచ్చిన్నమౌ సంసారం
భేషజాలకు పోని సంస్కారము నీది
సహజీవనంలో సరిగమల సాక్షిగా
మమతానురాగాలకు మారు పేరు స్త్రీ
అమ్మా! నీవే లేకుంటే ఈసృష్టి ఎక్కడిది
అందుకే
అమ్మను పూజించు
భార్యను ప్రేమించు
సోదరిని దీవించు
కూతురిని లాలించు
స్త్రీని గౌరవంచు
కలకంటి కంట కన్నీరొలికించకు!
మన సంస్కృతి మను సంస్కృతి
"యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్రదేవతాఃl
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాఃతత్రా ఫలాః క్రియాః
****************************
sk101-35అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
19 నవంబర్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్బంగా
పురుషుడు
పుట్టి పుట్టగానే
ఇంట్లో ఆనందపు పూలజల్లు కురుస్తుంది
వారసుడొచ్చాడని వంశోద్దారకుడొచ్చాడని
బాల్యదశలోనే బండెడుపుస్తకాల బరువు బాధ్యతగా మోస్తాడు
మెదడు పుస్తకంలో అక్షర విషయాలనెన్నో
పొందికగా రాసుకుంటాడు
యుక్తవయసులో కాలేజీ చదువులు
పరుగు పందెంతోమొదలెట్టి
మరాధన్ తోముగిస్తాడు
చదివినంతకాలం చదువే తన బాధ్యతగాభావిస్తాడు
ఉద్యోగం పురుషలక్షణం అన్నారు పెద్దలు
ఇందులోపురుషస్వార్ధం వీసంతలేదు
పురుష పక్షపాతమూ లేదు
ఆమాటకు అర్ధం
కుటుంబ బరువు భాద్యత పోషణ
పురుషునికి ఆపాదించటం
పూర్తిఅయినచదువుతో
ఉద్యోగ వేట బాధ్యతల సయ్యాట
ఎన్నో కలలతో మరోచేయి తోడందుకుని
తనచేయి తోడందించి
మరో నవ్యవసంతాన అడుగిడతాడు
నిజమే వసంతమే !
నవ వసంతం అందాలు
ప్రకృతి సరిగమలు
కోయిల మధుర రాగాలు
సుమపరిమళాల మలయ సమీరాలై
పచ్చని వెచ్చని "ఆ"వరణంలో
ఆనందం అంబరమంటే వేళ
అమ్మ అయ్య
"పెళ్ళామే బెల్లమా" నిరసనలతో
ద్విపాత్రాభినయం తప్పదు
అలీనవిధానంలో అల్లుకు పోతాడు
ఉలికిపడి మానసిక ఒత్తిడితో
వసంతం నుండి గ్రీష్మంలో అడుగుపెడతాడు
కుటుంబంకోసం భర్యాబిడ్డలకోసం
తన జీవితాన్నే కొవ్వొత్తిని చే్స్తాడు
జీవితభాగస్వామికి ప్రేమానురాగాలు
బిడ్డలకు మమతానుబంధాలు
సమాజానికి సౌబ్రాతృత్త్వాన్ని పంచుతాడు
సంసారమంటే సమస్యల తోరణం
సమస్యలతో.....రణం
ఇంటాబయటా వత్తిళ్ళను
పిల్లల చదువు పెళ్ళిళ్ళుకు
ఆర్ధిక వత్తిళ్ళను తానొక్కడే భరిస్తూ
తీవ్రమానసిక వత్తిళ్ళతో
వాడిన వృక్షమై అనారోగ్యం పాలవుతాడు
రక్తపోటు మధుమేహంపక్షవాతం
మైగ్రేన్ హెమరేజ్ గుండెపోటు
అన్నీకాకపోయినా కొన్నయినా
వృక్షానికి పూసిన పుష్పాలై
కూలిన వృక్షంతో కలిసి రాలిపోతాయి
అందుకే పురుషుడు త్యాగజీవి ...ధన్యజీవి !
************
అనుసూరి వేంకటేశ్వరరావు
(ఆరోగ్య సర్వేల ప్రకారం పైన చెప్పిన వ్యాధులు ఎక్కువగా మగవారికే వస్తున్నాయి)
****************
sk101-46 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
1/12/2015 (AIDS DAY) cell :7207289424
శీర్షిక: ఎయిడ్స్
రోగములనాపేటి నిరోధక శక్తి
నీకిచ్చె ప్రకృతి నిజముగాను
ప్రకృతిని ప్రశ్నించె వికృత వైరస్సు ఒకటిబుట్టె
తిరుగు బోతుల తిక్క తిరిగి ఆలోచింప
జాగ్రతల నేర్పెను ప్రభుతలిచట
మందు మాకులేదు మాయదారి రోగమ్ము
మరణమొక్కటే మందుగాన
అంటి ఆగమకుకుట కన్న
అంటకుండుట జేయ
సచ్చీలతయే నీకు సరిబాట
*************
sk101-44 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
DY SE CELL; 7207289424
శీర్శిక: వేదనలో లాలన
మనసు మనసులో లేదు మనసున నినుతలచి
నీవు దూరమైనా నీ మది నాకు చేరువయ్యే
ఎడబాటు మనుషులకే కాని మనసులకు కాదహో
నిజము తెలియుము నిదే నిక్కుటముగా.
*****************************************
sk101-45 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
DY SE CELL; 7207289424
శీర్శిక: రక్తకన్నీరు
మగడు చచ్చిన నేను మరియొక్కసారి
అరక దున్నితిని ఆశతోడ
విత్తు జల్లి నీరు పెట్టిజూడ
మొలకలొచ్చిన లేదు పచ్చ జూడ
ఎరుపు రంగున నారు తిలక వర్ణమునుండె
సగటు రైతు రక్త కన్నీరు బోలి
***********
sk 101-34 అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
Dy.Suprintendent Engineer
cell 7207289424
స్నేహం
తోడులేని మనిషి జీవితం
ఒంటిపిల్లి రాకాసి జీవితం
ఒంటికి చేటు ఇంటికి కీడు
చిత్ర విచిత్రాలు మానవ సంబంధాలు
విరుద్దమైన మనసైనా
నీటమునిగిన సేతువులా కలుపుతుంది స్నేహం
మనిషి సంఘజీవి
ఓర్వలేడు వంటరితనాన్ని
ఆత్మీయతానురాగ కేంద్రం
మానవ హృదయం
తోటి మానవుడి పట్ల సానుభూతి
ఏజంతువుకూ లేని
రసస్పందనలు మనిషివి
కరుణారస సింధువు హృదయాన ఉన్నవాడే
మహనీయుడౌతాడు
సలహాలమైత్రి హితుడు
భుజం తట్టేది సన్నిహితుడు
కర్తవ్యాన్ని గుర్తు చేేస్తాడు
కష్ట సుఖాల్లో తోడు నీడగ
నిలుస్తాడు స్నేహితుడు
స్నేహం అంటే ప్రేమ
ప్రేమ అంటే త్యాగం
ప్రేమించెే మనసే త్యాగం చెయ్యగలదు
ఇద్దరు వ్యక్తులను మానసికంగా ఆత్మికంగా
దరిచేర్చే దివ్యరసాయనం స్నేహం
దుఃఖంలోమునిగిన వ్యక్తి
బుజాన్ని స్నేహహస్తం తాకగానే
గుండెలోదాగిన కన్నీరు
పొంగిపొర్లుతుంది ఆత్మీయంగా అద్వితీయంగా
బాధాతప్త హృదయానికి
ఊరటకలిగించే ఆస్పర్శ
ఆర్ద్రమైన సానుభూతికి సంకేతం
ఘనవిజయానికి భుజం తట్టి
మెచ్చుకుంటే ఆనందపులకితమౌతుంది మనస్సు
ఆ భుజం తట్టే హస్తమే స్నేహానికి నేస్తం
స్త్రీపురుష హృదయపూర్వక చెలిమి బలిమికి
పరస్పర ఆకర్షణ ప్రధానమైనా
వారిని జీవితాంతం కలిపి వుంచేది స్నేహమే
ఇద్దరు ఒకటై చెరిసగమై ఒకరికొకరై
జీవించటానికి అంతరంగాన పాదుకున్న
స్నే హలతే పందిరివేయాలి పూవులు పూయాలి
కళ్ళ కిటికీలనుండి ఆత్మలు పరస్పరం స్పందించాయి
వారి స్నేహలత నుంచి వెల్లివిరిసిన ప్రేమ పారిజాాతం
మధురపరిమళాలు వెదజల్లింది
స్నేహసంబంధ మనోహరమూర్తిలు
ప్రేమనే స్ఫూర్తిగా మలచుకున్న ధన్యచరితలు
స్నేహమే ఆర్తిగా అలుముకున్న పుణ్యజీవులు
వారి జీవితం స్నహరాగ రంజితం
ఆధునిక జీవితాన ఒంటరి బతుకులు
ఆనందం లేని జీవనయానానికి స్నేహరాహిత్యమేహేతువు
ధనమే దైవంగాకొనసాగేవిచిత్రజీవనయాత్ర
ప్రేమ లేక మనసులు దూరమౌతున్నాయి
ఆలుమగలమద్య అంతరాలు
ఎడారిబాటనపయనిస్తువ్న
అధునాతన జీవితాాలకు
సరికొత్త స్నేహ ఒయాసిస్సులు నిర్మించాలి
జీవన వనంలో స్నేహ చకోరాలను పెంచుకోవాలి
జీవనగమనంలో స్నేహరాగబంధాన్ని పంచుకోవాలి...!
******************
sk101-48అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
Dy.Superintending Engineer cell:7207289424
dt 2/12/2015
శీర్షిక: ప్రియా!!
గ్రీష్మం లో
ఈ హిమ వీచికలేమి?
నిను తాకిన మలయసమీరము
మంచు బిందువాయనా??
హేమంతంలో
ఈ ఉష్ణతాపమేమి ??
నినుతాకిన మంచుబిందువు
ఆవిరై నీలిమబ్బును చేరెనా??
ప్రియా! నీ ముందు
ఏ ఋతు ప్రభావమైనా శూన్యము..!
**************
సహస్రకవి 101-49 అనుసూరివేంకటేశ్వరరావు
హైదరాబాదు , డిప్యూటి సూపరింటెండింగ్ ఇంజనీరు
3-12-2015 ప్రపంచవికలాంగుల సంక్షేమదినోత్సవం
శీర్షిక: దృక్పధ వైకల్యం
మిత్రమా!
వైకల్యజీవివి కావు నీవు
వైఫల్యం అంతకన్నా కాదునీది
కళ్ళు లేవని కలత చెందకు
నా కళ్ళతో కళ్ళుండీ కబోదియైన ఈ లోకాన్ని చూడు
చేయిలేదని చింత చెందకు
నా చేయూత ఉంటుంది నీ చెంతన
కాలు లేదని నీవు బాధ పడకు
కాలంతో నీవు పరుగులెట్టు
చెవులు లేవన్న వ్యధ నీకేల
చెవులుండీ వ్యధల ఘోష వినలేకున్నా !
నోరు లేదని నీరసం నీకెందుకయ్యా
అరచి అసత్యాలు పలుకని అదృష్టం నీదయ్యా!
ఆసక్తి ఉంది నీలో
అర్హత ఉంది నీలో
చేవ ఉంది నీలో
చేష్ట ఉంది నీలో
వైకల్యం నీకు సమస్య కాదు
సాఫల్యం నీ పాదక్రాంత
నిన్ను చూసి అయ్యో అనే
సమాజం ప్రభుత్వాల దృక్పధ వైకల్యం
పేదవారి కోసం
దళితుల కోసం
మైనారిటీలకోసం
పోరడే ప్రజాసంఘాలకు
స్వచ్చంద సంస్ధలకు
పాటు పడే ప్రభుత్వాలకు
కనపడవు మీ కన్నీటి చారికలు
వినపడవు మీ ఆకలి కేకలు
తెలియగ లేరు సామాజిక సంక్షోభం
చేయగ లేరు సమ్మిళితాభివృద్ధి
***************
సహస్రకవి 101-51 అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటి సూపరింటెండెంట్ ఇంజనీరు
3/12/2015
ప్రకృతి ప్రకోపమా!
ప్రకృతి ప్రకోపమా?
వరుణుడి కోపమా ?
పారిస్ సదస్సుకు
పర్యావరణ హెచ్చరికా?
కుండపోత వర్షం తో
కుదేలైన చెన్నపట్నం
కుదురు లేక
పెచ్చరిల్లె గ్రీన్ హౌస్ వాయువులు
పెరిగెను భూతాపము
విరిగెను ప్రకృతి నడుము
ఫలియించని చర్చలతో
దశాబ్దాలు దొర్లాయి
పెరిగిన ఉష్ణోగ్రతతో
మంచు ఫలకాలు ద్రవమై దొర్లాయి
కర్బన ఉద్గారాలతో అభివృద్దికి సోపానం
మానవ మనుగడనే చేస్తాయి భూస్ధాపనం
కళ్ళు తెరిచి ప్రభుతలన్ని
చర్యలు చేపట్టాలి
పారిస్ పర్యావరణ సదస్సు సాక్షిగా...
************
సహస్రకవి101-52అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాాబాదు
డిప్యూటి సూపరింటెండింగ్ ఇంజనీరు
3/12/2005
శీర్షిక: మరణం
పుట్టిన ప్రతి ప్రాణి గీట్టక తప్పదు
జీవితకాలాలే తేడా
పుట్టిన ప్రతిచెట్టూ
పుష్పిస్తుంది ఫలిస్తుంది
ప్రతిఫలాపేక్ష లేేకుండా
మానవునకందిస్తుంది
ప్రకృతితో మమైకమై
పర్యావరణాన్ని వాతావరణాన్నికాపాడి
ధన్యతనొంది కాలం చేస్తాయి
సర్వోత్తమ మనిషి జన్మ పొంది
స్వార్ధంతో పరోపకారము మరచి
జీవజంతు ప్రేమ మరచి
చెట్టు నరికి పుట్ట కూల్చి
చచ్చి శవమై చెరువు గట్టుకు చేరతాడు
చనిపోవడమే మరణంకాదు
ఏ పని చేయక పోవడమూ మరణమే
చేసే మంచిపనితో కాగలడు అమరుడే..
**************
సహస్రకవి101-53 అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీరు
3/12/2015 ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్బంగా
శీర్షిక:పోరాటం
అమ్మా
ఆకలేస్తుందని అడుగలేనమ్మా !
నోరులేని లేగలా నేనున్నా
నా పేగు ఆకలి కేక నీకెలా వినిపించిందమ్మా !
అవిటినైనా అక్కున చేర్చుకుంటావు
అందరి లానే నన్ను చూస్తావు
మరెందుకమ్మా అందరూ నన్ను అవిటి అంటారు?
చదువులో ఆటలో ముందున్నా
అదోలా చూస్తారెందుకు?
ఆటపట్టిస్తారెందుకు?
వేరుచేస్తారెందుకు?
గేలిచేస్తారెందుకు?
నీవిచ్చే ప్రేమను వాళ్ళెందుకివ్వరు?
నీవిచ్చే ధైర్యం వాళ్ళెందుకివ్వరు?
ఎవరేమన్నా
ఎవరేమనుకున్నా
నాకూ కలలున్నాయి
నాకూ ఆశలున్నాయి
నాకూ ఆశయాలున్నాయి
నీవిచ్చే ధైర్యంతో
సమాజ దృక్పద వైకల్యాన్ని జయిస్తాను
నా కలలు ఆశలు ఆశయాలుా సాధిస్తాను...
***********
సహస్రకవి101-54అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇజనీరు
cell:7207289424
శీర్షిక: గుండె చెరువు
కాంక్రీటు జంగల్
మెట్రోపాలిటన్
చెరువైన చెన్నపట్నం
వరుణుడి కోపమో?
కర్బన ఉద్గారాల పాపమో ?
మనిషి సుఖజీవన వ్యమోహమో?
భారీ వర్షాలు భారమైనాయి
వరదలు వణికిస్తున్నాయి
గూడు చెదిరి గుండె చెరువై
అన్నపానీయాల కోసం
అలో లక్ష్మణా అంటూ
ఆదుకునే ఆపన్నహస్తం కోసం
కాలుకదపలేక
ఎటూకదలలేక
ఆహారంకోసం ఎదురు చూసే
గువ్వ పిల్లల్లాఎదురు చూస్తున్నాయి
చెరువైన చెన్నైలో
చెరువైన గుండెలెన్నో
త్రాగునీరు లేక
తడారిన గొంతుకలు
ఎడారిలో ఒయాసిస్సుల కోసం దీనంగా
ఎదురు చూస్తున్నవి
గొంతు తడిపే నీటి బొట్టుకోసం
కకావికలం జనజీవనం
ప్రభుత్వాల నిర్లక్ష్యం
ప్రజల స్వార్ధపరత్వం
మాయమైన చెరువులు
మాయమైన కాలువలు
ఆక్రమణలో నదులు
అడయార్ కూవం కశస్ధలి
పెరుగుతున్న విజ్ఞానం
తరుగుతున్న ఆచరణ
నీరు పల్లమెరుగు
నిజమే.......
మరి పల్లమెవరు ఎరుగు???
ప్రకృతి విలయం ప్రమాదమయితే
ప్రభుత్వాలది ఏమోదం??
మానవసేవే మాధవసేవంటూ
నాన్ ఉంగలోడు ఇరిక్కేన్ అంటూ
అందరం అందిద్దాం
అవసరానికి ఆపదలో
ఆపన్నహస్తం...!
********************
సహస్రకవి101-56అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటిసూపరింటెండెంట్ ఇంజనీరు
cell 7207289424
శీర్షిక :అన్నదాత
పురుగుమందుకు నేలకొరిగిరి ఒకరు
కరంటుతీగకు బలి అయ్యి ఒకరు
రైలుకు ఎదురెల్లి ఒకరు
ఉరికొయ్యకేళ్ళాడి ఒకరు
రైతుకాదని ఒకరు
రచ్చ చేయబూని ఒకరు
అన్నదాత అనాధఅయ్యెనా....అయ్యో......!
చావు లెక్కలు తేల్చక
బడ్జట్టు లెక్కలేస్తారు
సంబురాలు చేస్తారు
గిట్టు బాటు ధర అంటె
ముఖం చాటేస్తారు
ఖాళీ జేబూల్తో
కాలేకడుపుల్తో
కూలీదొరక్క
తన కడుపు నింపక
తనవాళ్ళ కడుపు నింపలేక
అభద్రతాభావంతో
అన్నదాత అసువులు బాసెనా...
అయ్యో అన్నదాతా !
మాకు అన్నం పెట్టే దిక్కెవరు?
దేశ ఆహారభద్రతకు దిక్కెవరు??
**********
సహస్రకవి101-57అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటి సూపరింటెండెంట్ ఇంజనీరు
cell 7207289424
శీర్శిక: ప్రేమ
మాటలతోపుట్టి మాటలతోపెరిగి
మాట్లాడకుంటే పోయేదికాదు ప్రేమంటే
పోట్లాడుకుంటే పోయేది కాదు ప్రేమంటే
కంటి చూపుల్తో మాట్లాడు కోవటం కాదు ప్రేమంటే
సినిమాలకు "షి"కారు" ల కెల్లడం కాదు ప్రేమంటే
పబ్బుల నాట్యం కాదు ప్రేమంటే
ఆకర్షణలతో " అందు"కోవటం కాదు ప్రేమంటే
తిరస్కారానికి మరణశాసనం కాదు ప్రేమంటే
నమస్కారానికి ఆసిడ్ శాసనం కాదు ప్రేమంటే
ప్రేమించిన మనిషి సుఖాన్ని కోరేదే ప్రేమ
మనసులోపుట్టి మరణంవరకూ తోడు ఉండేదే ప్రేమ
**************
సహస్రకవి101-58అవుసూరివేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీరు
cell: 7207289424
శీర్షిక: సంస్కృతి
సహనమే సంస్కృతి
ద్విసిద్దాంత సంస్కృతి
ఆదర్శవాద సిద్దాంతం
బౌతికవాద సిద్దాంతం
ఆదర్శవాద సిద్దాంతం
ఆర్య సంస్కృతి
వేదసంస్కృతి
బౌతికవాద సిద్దాంతం
బౌతిక పరిసరాలు అవసరాలు
జీవితానుభవ సిద్దాంతాల
విశ్వాస భావాల సంస్కృతి
"సమ్యక్ కృతి సంస్కృతి"
అంటే చక్కగా తీర్చిదిద్దినది
సంస్కరించునది సంస్కృతి
నాగరికత పరంగా
ఆచారవ్యవహారాలు
సంప్రదాయాలు
కట్టు బొట్టూ
కళలు
సాహిత్యం
జాతి సమగ్ర జీవన విధానం సంస్కృతి
సంపూర్ణవికాస చిత్రం సంస్కృతి
సమదృష్టి సమ దృక్పధం సంస్కృతి
జాతీయ మనస్తత్వం మేధోసంపత్తి
జాతీయ సంస్కృతి
ప్రజలు ఏసమాజానికి చెందినా
సమ్మిళిత సమ్మిశ్రిత సంస్కృతి జాతీయ సంస్కృతి
*****************
సహస్రకవి101-59అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీరు
cell 7207289424
ప్రకృతి విలయము కాదు మానవ హత్యలు
పొలమున జలము నిండిన
నీటికి దారి చేయు
మురుగు కాల్వలో.... కర్షకుండు
జలము నిండిన మురుగున
పారనతొలగింతురు పూడిక
నిండుగ దిగువకు దిగగ నీరు
చెన్నపట్టణాన మురుగు దిగగ
దారి వెతుకుచు గంగమ్మ
దారి గానక పట్టణమ్మున జొచ్చె
మురుగు కాలువల పూడిక
ముప్పది శాతమట
చెరువులన్ని ఆక్రమణల వరములయ్యె
కాలువలందు కాలనీలు వెలసె
నదుల ఒడ్లు నడ్డివిరిగె
ప్రభుత చేతగాదు
చట్టమిచట లేదు
ఆక్రమణపూడికను
తొలగించె నాధుండెవ్వడు?
నాకే చేస్తారా "రాస్తారోకో" అని
ఆగ్రహాన గంగ జనహననమొందించె
ప్రళయ రాణి వోలె ప్రజ్వలించే
నిలుప ప్రాణము నిలిచె వైద్యాలయాలు
మందు మాకు లేక
విద్యుత్తు లేక
వెంటిలేటరు లేక
వెంటిలేషన్ లేక
కుళ్ళుతున్న శవాల
దుర్గంధ " భూతమై"
నిలిచినవి మిధ్యాలయాలై
చెన్నపట్టణము స్మశానము చేసినయట్టి
మానవాక్రమణలు శిక్షార్హమైన తప్పిదములే
ప్రకృతి విలయము కాదు
తరచి చూడ మానవ హత్యలివి
మరి నిలదీయగ లేడిచట "అపరిచితుండు"
*************
సహస్రకవి101-60అనుసూరి వేంకటేశ్వరరావు హైదరాబాదు
సహస్రకవుల రెండవ సంకలనం దీ 6/12/2015
విషయము : సరస్వతి
శీర్షిక: సరస్వతి మాత
ఓం జై సరస్వతి మాతా జైజై సరస్వతి మాతా
శరణాగతులను ఉద్దరించే మహిమాన్విత మాతా
ఓం జై సరస్వతి.....
జ్ఞాన నేత్ర ప్రధాతా
మహాభాగ్యవిధాతా
నిను కొలిచే మనుజల సిరులిచ్చే మాతా
ఓం జై సరస్వతిమాతా ...
నీ దయ మించన సిరి ఉందా
నావాక్కుననిలిచే దయవుందా
మనసా వాచా కొలిచేవారికి నీ దయ చూపు మాతా
ఓం జై సరస్వతిమాతా ..... మనుజుల నేలే మహాదేవీ
మా వాక్కున నిలిచే వాగ్దేవీ
అంబ వాగీశ్వర మాతా ......
ఓం జై సరస్వతిమాతా ......
సర్వ జ్ఞాన ప్రధాతా
సర్వ వేద విధాతా
నాలోసుస్వరమై నను గావుము మాతా
ఓం జై సరస్వతి మాతా .....
ఓం నమో మహా మాయా
ఓం నమో కమాలాసనా
నా మనసున నిలిచిన మనోరంజని మాతా
ఓం జై సరస్వతి మాతా ....
భారతి నీవే అక్షరమై
నా జీవన రాగ సుస్వరమై
నా కవనంలో జీవమై నిలువుము మాతా
ఓం జై సరస్వతిమాతా ..
శాస్త్రరూపిణి మాతా త్రికాలజ్ఞమాతా
బ్రహ్మవిష్ణు శివాత్మికమాతా
భువనము నేలగ రావా మాతా
ఓం జై సరస్వతి మాతా
కరుణను జూపవె కమలాక్షి
మూఢ మతులకు మతినిమ్ము
నిజనీరాజన మిదే మాతా మము కరుణించుము మాతా
ఓం జై సరస్వతి మాతా
****************
సహస్రకవి101-55అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు 7/12/2015
శీర్షిక: జండా--ఎజెండా
వలసలు రాజకీయ రంగు మార్పిడులు
వలసలు ఊసరవెల్లుల విన్యాసాలు
నీతిమాలిన రాజకీయాలకు అద్దాలు
నిజాయితీని సమాధి చేసే నిశిక్రీడలు
ఒకరోజు త్రివర్ణం
ఒకరోజు కాషాయం
ఒకరోజు పసుపు
ఒకరోజు గులాబీ
ఒకరోజు ఎరుపు
ఒకరోజుపచ్చ
మరొక రోజు మరొక రంగు
ఒక్కొక్క రంగుకు
ఒక్కొక్క జండా
ఒక్కొక్క ఎజెండా వున్నా
ఒకే ఎజెండా తప్ప
ఏ ఎజెండా లేని వాళ్ళు ( వి) నాయకులు
ఆ ఒక్కటే పదవి ఎజెండా
ఒక జండాతో గెలుస్తారు
మరో జండా ధరిస్తారు
గెలవక ముందు నాయకుణ్ణి పొగుడుతారు
గెలిచాక కండువా మార్చి మరీ తెగుడుతారు
సిద్దాంతం బద్దతకు ప్రమాణాలు చేసి
ఓటరు దేవుళ్ళంటూ ప్రణామాలు చేసి
జవాబు దారి లేని ప్రజా దేవుళ్ళీ (వి)నాయకులు
సిద్దాతం రాద్దాంతమైనపుడు
ప్రమాణాలను ప్రణామాలనూ తుంగలోతొక్కే
మారాజుల ఎన్నిక
కాదా ప్రజల నెత్తిన భస్మాసుర హస్తం ??
(ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు)
*************
సహస్రకవి101-61అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు 7/12/2015
శీర్షిక: వలస పక్షులు
కొన్ని వేలకిలో మీటర్ల ఆవల మా ఊరు
ఊరు వదలి దేశం వదలి ప్రకృతి ప్రేమలో
మైమరచి పోదామని వచ్చాము
వలస పక్షులం ఫ్లెమింగోలం మేము
ఇల్లూ వాకిలి లేని సంచార పక్షులం
ఆకాశం అంచును తాకగలం
మేఘాలను చుంబించగలం
శరదృతువులో మాకనుకూల వాతావరణంలో
పిక్నిక్ కని వచ్చాము సొంత గూడువదలి
అత్తగారింటికి వచ్చే పెళ్ళి కొడుకుల్లా
ప్రతీ ఏడు వస్తున్నాం ప్రకృతిలో పరవశించి వెళుతున్నాం
కానీ ఈ ఏడు ఆనంద ఉత్సాహలతో
ఇక్కడికి చేరుకున్న మాకు నిరాశే
ఆనాటి మెదక్ అడవుల పచ్చదనం ఏది??
వాగుల వంకల ఎగిరి దూకే జలపాతములేవి?
మంజీరా వయ్యారాల వంపుల్లో
జలజల పారే జలసిరులేవి?
మంజీరా ప్రాజక్టు
ఆకలితో అలమటించే
పేదవాని ముఖము వలే
కళావిహీనమైనది జలములేక
ఋతుపవనాలు ముఖం చాటు చేసెనో ?
ఎల్నినో ప్రభావమో ?
గ్రీన్ హౌస్ వాయు ప్రభావమో ?
వర్షాలు లేక ఎండెను మా అభిమాన సరస్సు
కళకళలాడే పచ్చని
అడవి తల్లి వెలవెల బోయింది
నీరులేని సరస్సులో మాకాహారమేది .?
మాకు జలకాలాటల ఆనందమేది?
వేలలో వచ్చే మేము రేడియేషన్ మృత్యుపాశానికి
కొందరు బలి కాగా వందలలో మిగిలాము
ఎండిన సరస్సును జూచి
మరలిపోయారు సహచరులు కొందరు
నిరాశా నిస్పృహతో !
ఆందోలు చెరువులో నీరు తక్కువున్నా
తిప్పలు తప్పవనీ అక్కడ చేరాము
కరుణిస్తే ప్రకృతి వస్తాయి వానలని
ఆశతో కాలం వెళ్ళబోస్తున్నాం బిక్కు బిక్కంటూ
***************
సహస్రకవి101-62 అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు 7/12/2015
బుద్ద ఉవాచ
తన్నుట తిట్టుట మాత్రమే కాదు హింస
మందలించుట మాత్రమే కాదు హింస
మనసు గాయపరిచే మాట కూడా హింసే
ఇష్టం పడేట్లు చెబితే
కష్టం లేకుండా గ్రహిస్తాడు
అదే"మనసెరిగి చెప్పటం"
మనషి పై మనిషి అధికారం
బానిస యజమానుల లక్షణం
అదిలించి చెప్పనేల
అనునయ భాషఉండగా
*********
సహస్రకవి101-64అనుసూరివేంకటేశ్వరరావు
హైదరాబాదు
శీర్షిక:మేమేం పాపం చేశాం
విధాతా!
మేమేం పాపం చేశాం మూగజీవులగా పుట్టించావు?
ఆకలేస్తే అర్థంకాని భాషలో అరవటం తప్ప ఏం చేయగలం
దాహమేసినా అదే భాషమాది
వానల్లేక పచ్చిమేత కంటిచూపుకానక పాయే
రైతుకు పంటలేక అసువులు బాసుతుండె
మరి ఎండు గడ్డి ఎక్కడిది
నీరు లేక బీడువారింది అదిలాబాదు
పాలమూరులో దుర్బిక్షంతో గడ్డికరువు
మెతుకుసీమ మెదక్ లో క్షామం కరాళ నాట్యం
గుప్పెడు గడ్డి కరవైన నిజామాబాదు
ఓరుగల్లులో కరువు కాటకం
ఖమ్మం లో కరువైన పశుగ్రాసం
నల్లగొండలో తీరని పశువుల ఆకలి
రంగారెడ్డిలో గండమైన పశుపోషణ
కరీంనగర్లో కనుమరుగైన పశుగ్రాసం
మనుషుల్లా రోడ్లెక్కి రాస్తా రోకో చెయ్యలేము
నీరసంచటం తప్ప నినాదాలివ్వలేము
పోరాటం చెయ్యలేము
మా కడుపు నింపలేని అన్నదాత
మా తల రాతను ఏకబేలాకో రాస్తాడు
కడుపులు కాలే మేము మీ
కడుపులు నింప కళ్యాణి బిర్యానీలవుతాం
కళ్యాణాల్లో ఢంకాలమవుతం
కాళ్ళకి చెప్పులమవుతాం
విధాతా! మేమేంపాపం చేశాం ??
***********
సహస్రకవి101-66అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు
శీర్షిక: అమ్మ-నాన్న
నాన్నా!
నా చిరునవ్వులు చూసి మురిసావు
యెదపై ఆడించావు ఎత్తుకుని లాలించావు
నాకు చేయూతనిచ్చావు
తొలి అడుగులు వేయించావు
నీ కష్టాన్ని గుండెలో దాచుకొని
నా కోరికలన్నీ తీర్చావు
నీ సంపాదన నీకోసం కాకుండా
మాకోసమే నన్నావు
బతకటానికి తినాలి
తినటానికి బతకొద్దన్నావు
నాకు తోడు ఆసరా ధైర్యం నువ్వే నాన్నా
నాగెలుపును నీ విజయంగా చెప్పుకుంటావు గర్వంగా
నా ఓటమిలో నేనున్నానని భుజంతట్టి ధైర్యాన్నిస్తావు
విద్య బుద్దులు నేర్పించావు
నా గెలుపుకి పూల బాటను పరిచావు
అమ్మా !
సృష్టికి మూలపుటమ్మవు నీవు
నవమాసాలు బరువనుకోకుండా మోసావు
రక్తమాంసాలతో రూపమిచ్చావు
నీ ఊపిరి సాక్షిగ నాలో ఊపిరిలూదావు
కన్ను తెరవలేదు కనలేదు లోకం
నీ వెచ్చని స్పర్షే నాకు ఇంద్రలోకం
పురిటికందుగ నన్నుహత్తుకున్న
నీ గుండియల స్పర్ష
సృష్టిలో మరేప్రాణికీ
దొరకని ఆత్మీయ స్పర్ష
లాలి పాడి జోలపాడి
కమ్మనైన చనుబాలు త్రాపి
అందు ప్రేమానురాగాలు మేళవించి
సుఖనిద్రనిచ్చావు
నే బాధ కలిగి "అమ్మా"అంటే
చెమర్చునమ్మా నీ కళ్ళు
ఆ కన్నీటిలో దాగున్న అనురాగ
బంధం ఎవరికి తెలియదు
నీచేతిచలువన నీ కంటివెలుగయ్యాను
భువికి దేవుడిచ్చిన పెన్నిధి నీవు
నీవు పంచిన ప్రేమ సుమాలు
నా బ్రతుకును పూలబాట చేశాయి
నా కంట నీరు నిండినప్పుడు
నీ గుండె చెరువయ్యేనా
అనురాగానికి అద్దం నువ్వు
మమతకు భూదేవి సమమవ్వు
ప్రేమకు ఆకాశం నువ్వు
తొలి నమ్మకం నీవే
తొలి ప్రేమ నీదే
తొలిగురువు నీవే
తొలి స్నేహం నీదే
తొలి విమర్షనీదే
అందుకే అమ్మా నువ్వు "అమ్మ"వు!!
**********
సహస్రకవి101-65 అనుసూరి వేంకటేశ్వరరావు
హైదరాబాదు
శీర్షిక: తల్లిదండ్రులు
తండ్రి కోపం తల్లి ప్రేమ
లక్ష్మన రేఖలు కారాదు
పిల్లలతో లాలనతో
కబుర్ల కాలక్షేపం
రోజువారీ చర్చల్లో
సాధక బాధకాలు
జయాపజయాలు
సంస్కార కుసంస్కారాలు
భాధ్యత గలపౌరునిగా
వికసించే భవిష్యత్తుకు సోపానాలు
ఆలు మగలు
పరస్పర ప్రేమాభిమానాలతో మెలగాలి
పిల్లముందు ఒకరినొకరు
దూషణ కు దిగరాదు
ఇద్దరిపై పూజ్యభావం
కలిగిచాలి శిక్షణతో
బాల్యం బంగారు భవితకు పునాది
పనులు నేర్పాలి ఓర్పుగా
బరువు భాధ్యత విలువల వలువలు తొడగాలి
వ్యక్తిత్వ నిర్మాణ విలువలు తెలపాలి
సంస్కృతి ఆచార వ్యవహారాలు
ఆచరణలో నేర్పాలి
సమాజ సంఘ జీవన ఔన్నత్య విలువలు నేర్పాలి
అందమైన ఊహా ప్రపంచాన్ని
భవిష్యత్తుని కలగనమనాలి
నచ్చినవి నచ్చనివి అన్ని విషయాలు
నేర్పుతో ఓర్పుతో నేర్పాలి
స్త్రీలను గౌరవించటం
మంచి స్నేహం బాలురకు
బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి
అతిగారం అతి దండనం
విపరీత పోకడలకు అసహనానికి ఇంధనాలు
తల్లి దండ్రుల అనునయ సమన్వయాలే రక్షణ కవచాలు
క్రమశిక్షణ లోపంతో నిండుతున్న
కౌన్సిలింగ్ కేంద్రాలు
తల్లిదండ్రుల ఉద్యోగ వత్తిడి
సమన్వయ లోపం
పిల్లలకు అనురాగ ఆప్యాయతల లోటు
పిల్లల పట్ల లింగవివక్ష కూడదు
సెల్ ఫోన్ల వినియోగం
అంతర్జాల అప్రమత్త నేర్పాలి
బాలల బంగారు బాల్యానికి భవితకు
అమ్మానాన్నలే పూల బాట వెయ్యాలి
పిల్లల భవిష్య నిర్మాణంలో నిత్యకార్మికులు
ప్రేమ అనురాగం ఆప్యాయతలే ఇటుకలుగా
విద్యవిజ్ఞానాలే సిమెంటుగా
బంగారు భవిష్యత్ భవన నిర్మాణంలో
నిత్య శ్రామికులు నిత్య కార్మికులు
కూలి ప్రతిఫలాపేక్ష లేని త్యాగధనులు
*************
No comments:
Post a Comment